Saankhya-Taaraka-Amanaska-Yogam

సాంఖ్య తారక అమనస్క యోగము
సద్గురు పరబ్రహ్మణేనమః

న గురోరధికం తత్త్వం న గురోరధికం తపః I
న గురోరధికం సత్యం పునః సత్యం పునః సత్యం II అని,
గురుపౌర్ణమి నాడు, అన్ని సాంప్రదాయాలలో, ముఖ్యంగా భారతీయ సాంప్రదాయాలలో వున్నటువంటి ఔన్నత్యం, గురువుకి విశిష్ఠ స్థానాన్ని ఇవ్వడమే. ప్రపంచంలో ఎన్నో సంప్రదాయాలు వున్నప్పటికీ కూడా, ఆ సంప్రదాయాలన్నింటికీ కూడా, భారతదేశం ప్రతిపాదించినటువంటి ఈ గురుతత్వమే, తలమానికమై వున్నదన్నమాట. మనిషి తనకు తెలిసిన విధంగా అనేక రకాలైనటువంటి సాధనలు చేస్తాడు. భగవంతుడిని తెలుసుకోవాలనో, ఉన్న దుఃఖాలు పోవాలనో, లేని కష్టాలు రావాలనో వాటి వెనుకాల అనేక రకాల కారణాలు వుంటాయి. అయితే సరియైనటువంటి మార్గదర్శకత్వం లేకుండా చేసేటటువంటి ఏ ప్రయత్నమైనా కూడా వికల్పాలతో కూడుకుని వుంటుంది. అందువల్ల ఏది తలపెట్టినా మార్గదర్శకత్వం అనేది చాలా తప్పనిసరి.
            ఆది గురువైనటువంటి, అందరికీ తారకమంత్రం బోధించినటువంటి సదాశివుడు గురువులందరిలోకెల్ల మొట్టమొదటివాడు. మనిషి తరించాలి అంటే సాంఖ్య తారక అమనస్క పద్ధతిని ఆశ్రయించాలి అనేది ఒక సిద్ధాంతం. గురుశిష్య సంప్రదాయంలో అనేక విధాలు, అనేక రీతులు కాలానుగుణ్యంగా, ఆయా బోధారీతులను అనుసరించి కనపడ్డప్పటికీ, సామాన్యంగా కనపడేటటువంటి ఏక సూత్రం సాంఖ్య తారక అమనస్క పద్ధతి. ఈ సాంఖ్య తారక అమనస్క పద్ధతి చాలా స్పష్టమైనటు వంటి విధానం అన్నమాట. ఆ సేతు హిమాచలం అంటే, ఋషీకేశ్‌ ఆశ్రమాలలో మీరు వేదాంతాన్ని అభ్యసించినా, కన్యాకుమారిలో అభ్యసించినా కూడా ఈ సాంఖ్య తారక అమనస్క సూత్రాలనే పాటిస్తారు. వేదాంత విచారణ గానీ, వేదాంత బోధకి గానీ, ఈ సాంఖ్య తారక అమనస్క సూత్రం అనేది పట్టుకొమ్మ.
            విద్యారణ్యులు బోధించినటువంటి వేదాంత పంచదశి’. అటువంటి వేదాంత పంచదశి కూడా, కపిల మహర్షి బోధించినటువంటి సాంఖ్య దర్శన సూత్రాలని ఆదర్శంగా స్వీకరించి బోధించారు. అయితే ఈ విచారణ ఎడతెగక సాగుతూ వుంటుందన్నమాట. ప్రతి సాధనలో కూడా దాని పరిమితులను గుర్తెరగడం చాలా అవసరం. ఈ సాంఖ్య విచారణ ఎప్పటికైనా పూర్త అవుతుందా అంటే, ఒకసారి మొదలు పెడితే ఎప్పటికీ పూర్తికాదది. మీరు నేర్చుకుంటున్నటు వంటి పంచకోశ విచారణ’ ‘త్రివృత్కరణఅంటే అవస్థాత్రయం, గుణత్రయం, శరీరత్రయం ఇలా మూడు మూడుగా చెప్పేటటువంటి ఎన్ని సిద్ధాంత భేదాలైనా సరే ఇవన్నీ సాంఖ్య విచారణలో భాగమే. అయితే దీనికి స్పష్టత జోడించడానికి పిండాండ పంచీకరణ, నమఃశివాయ పంచీకరణ దానినే అక్షర బ్రహ్మాండ పంచీకరణ, ఆఖరికి ఈశ్వర పంచీకరణ అనేటువంటి నాలుగు స్పష్టమైన బోధా విధానాలను ప్రవేశపెట్టారు. ఇదంతా కూడా సాంఖ్య విచారణే. ఇక స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ తను చతుష్టయం అది మళ్ళా జీవ తనువులు, ఈశ్వర తనువులు అనేటటువంటి రెండు భేదాలతో, మళ్ళా ఆయా తను చతుష్టయానికి సంబంధించినటువంటి సాక్షిత్వ నిర్ణయం ఈ లక్ష్యంతో బోధించబడుతూ వుంటాయి. సాంఖ్య విచారణ అంతాకూడా. అంటే జాగ్రదావస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యావస్థ, తురీయము మళ్ళా ఇలా కూడా సామ్యం కోసమని చెప్పబడుతుందన్నమాట. అంటే కేవలం మళ్ళా స్థూల శరీరం అంటే సప్తధాతువులతో కూడినటువంటి నీ శరీరం గురించే చెబుతున్నారని అనుకుంటారని, వ్యష్టి సమిష్టి భేదాలని, జడ చేతన విమర్శను కూడా జోడించి చెబుతారన్నమాట ఈ సాంఖ్య విచారణలో.
ఇలా బోధించడం వల్ల ఈ సాంఖ్య విచారణను మీరు సాంగముగా అభ్యసించడం వల్ల, ఇదంతా అభ్యాసంలో భాగమేనండి. ఈ సాంగముగా అభ్యసించడం వల్ల మీకు ఒనగూడేటటువంటి గొప్ప ప్రయోజనం ఏమిటంటే,
సాంఖ్యము తెలియక, సంకెళ్ళ విడవుఅని పెద్దల వాక్యము. ఈ సాంఖ్యము తెలియకపోతే సంకెళ్ళు విడిపోవు. ఏంటయ్యా ఆ సంకెళ్ళు? అంగం అనే సంకెళ్ళు, లింగం అనే సంకెళ్ళు. రెండు సంకెళ్ళు ఉన్నాయి. మనకేం వున్నాయండీ? పుట్టుకతోనే వచ్చినాయి, నువ్వు పుట్టక ముందే వున్నాయి అంగం అనే సంకెళ్ళు, లింగం అనే సంకెళ్ళు. ఈ సంకెళ్ళు విడిపోయే పద్ధతిలో సాంఖ్య విచారణ చేయాలి కానీ, సంకెళ్ళు బలపడే పద్ధతిలో సాంఖ్య విచారణ చేయకూడదు.
నిన్నంతా పరిశీలించిన మేరకు, మీరంతా బాగా చదువుతున్నగా కనబడుతుంది కానీ, సంకెళ్ళు విడిపోతున్నట్లు కనబడటం లేదు. కాబట్టి మీరు అధ్యయనం చేసేటప్పుడుగానీ, మిమ్మల్ని మీరు పరిశీలించుకునేటప్పుడు గానీ, ఈ జాగ్రత్‌ సాక్షి అయినటువంటి విశ్వుడు, స్వప్న సాక్షి అయినటువంటి తైజసుడు, సుషుప్తి సాక్షి అయినటువంటి ప్రాఙ్ఞుడు, తురీయ సాక్షి అయినటువంటి ప్రత్యగాత్మ ఇది జీవతను చతుష్టయానికి సంబంధించినటు వంటి సాక్షిత్వం.

సాక్షి అనేవాడు ఇంతకీ ఒకడా నలుగురా? ఒకడా నలుగురా?
            ఒక్కడే!
ఒకడేనా? మరి నాలుగు చెబుతున్నావు?
అవస్థని బట్టి చెబుతున్నావు.
ఇంతకీ అవస్థ అంటే ఏమిటి అసలు?
అస్థఃఅంటే స్థిరముగా వుండుట. బాగా గుర్తుపెట్టుకోండి. అస్థఃఅంటే స్థిరముగా వుండుట. అవ అంటే దిగడం, స్థిరముగా – శాశ్వతముగా ఉన్నటువంటి స్థితి నుంచి దిగడం. చ్యుతిచెందడం, ఆ స్థితి పోవడం. అది అవస్థ అంటే అర్థం.
ఇప్పడు తురీయాన్ని అవస్థ అనవచ్చా?
జాగ్రదావస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యావస్థ అన్నట్లే తురీయావస్థఅని అనవచ్చా?
అనకూడదు. కాబట్టి,
దానిని ఏమని అనాలి?
తురీయం అనే అనాలి. అవస్థ అని అనకూడదు. అర్థమైందా అండీ?
కాబట్టి, తురీయ సాక్షి ఎవరు?
ప్రత్యగాత్మ.
కాబట్టి, జీవతను చతుష్టయానికి లక్ష్యం ఎవరయ్యా? అంటే,
ప్రత్యగాత్మ.
అట్లాగే ఈశ్వర తను చతుష్టయానికి కూడా ఇదే పద్ధతిలో వున్నాయి.
ఏమిటవి?
విరాట్‌, హిరణ్యగర్భ, అవ్యాకృత, పరమాత్మ.
మరి, ఆ ఈశ్వరతను చతుష్టయానికి లక్ష్యం ఎవరు?
            పరమాత్మ.
ఈ ప్రత్యగాత్మ, ఆ పరమాత్మ ఒక్కడే అని ఏదైతే నిరూపిస్తుందో, అదే తారకం”. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ విడమరచి చెప్పి, మీకున్నటువంటి భ్రాంతిని తొలగించేటటువంటి ప్రయత్నం చేసేది సాంఖ్య విచారణ అయితే, ఈ ప్రత్యగాత్మ, ఆ పరమాత్మ ఒక్కడే అని ఏ సాధన చేతనైతే నిరూపించబడుతుందో, ఏ సూత్రం చేతైతే నిరూపించబడుతుందో దానిపేరే తారకం. ఈ తారకం యొక్క అనుభవజ్ఞానం ఎవరికైతే వుంటుందో, వాళ్ళే నిర్ణయంగా చెప్పగలగుతారు ఈ ప్రత్యగాత్మ, ఆ పరమాత్మ ఎలా ఒక్కటయ్యారు?
            సాంఖ్య విచారణ చేసేటప్పుడు విచారణగా చెప్తాం. ఈ నాలుగు ఆ నాలుగు ఒక్కటే, ఇది వ్యష్టి అది సమిష్టి అని. అది మీ ఊరు అడ్రెస్‌ చెప్పటం లాంటిది, మిమ్మల్ని వెతికి పట్టుకోవడం లాందటిది కాదన్నమాట.
తారకము అంటే తరింపజేసేది అని అర్థం.
ఎక్కడి నుంచి ఎక్కడికి తరించాలి?
ప్రత్యగాత్మ నిర్ణయం నుంచి పరమాత్మ నిర్ణయం వరకూ తరించాలి.
అయితే, మరి అమనస్కంఅని ఎందుకు పెట్టవలసి వచ్చింది?
            మూడవదైనటువంటిది అమనస్కం. నిష్కామ కర్మ చేయడం ద్వారా, నిత్య జీవితంలో అనుష్టానం చేయడం ద్వారా, చేయడం అంటే అదేదో మామూలు చేయడం కాదది. నిష్కామకర్మను అనుష్టానవిధిగా స్వీకరించాలి. యజ్ఞభావంతో స్వీకరించాలి. వేరే యే ద్రవ్య యజ్ఞాలు కానీ లేక ఇతరత్రా భావ యజ్ఞాలు కానీ లేక కామ్యక యజ్ఞాలు కానీ, ఈ నిష్కామ కర్మ అనేటువంటి యజ్ఞానికి సాటిరావు.  
            ఈ నిష్కామ కర్మ యజ్ఞాన్ని, ఏ సాధకుడైతే మనో వాక్కాయములతో స్వీకరిస్తాడో, మనస్యేకం, వచస్యేకం, కర్మణ్యేకం అనేటటు వంటి ఏకత్వ దృష్టితో ఎప్పుడైతే ఆచరిస్తావో, అప్పుడీ నిష్కామకర్మ నీకు నిర్వాణసుఖాన్ని అందజేస్తుంది. అంటే చిత్తవృత్తి శూన్యాన్ని అందజేస్తుంది. ఆ చిత్తవృత్తి శూన్య స్థితి పేరే నిర్వాణము. ఆ నిర్వాణ స్థితిలోనే, నీ యొక్క స్వరూపజ్ఞాన ప్రకాశాన్ని నీవు తెలుసుకోగలుగుతావు. ఆ స్వరూపజ్ఞాన ప్రకాశం పేరే ప్రత్యగాత్మ. ఆ స్వరూపజ్ఞాన ప్రకాశ అనుభవజ్ఞానం నీకు ఎప్పుడైతే కలిగిందో దాని పేరు ఆత్మానుభవం. ఈ స్థిరమైనటువంటి అనుభవజ్ఞానం నీకు కలిగినప్పుడు, నిర్విషయం మనః అనే దానికి కోసం ఇప్పుడు మీరేదో ఐదేళ్ళు, ఏడేళ్ళు, పదేళ్ళు, ఇరవైయేళ్ళు, ముప్ఫైయేళ్ళుగా ప్రయత్నం చేస్తున్నదంతా ఒక రెప్పపాటులో సాధించవచ్చు. కనులు మూసి కనులు తెరిచే లోపల నిర్విషయం మనఃఅవుతుంది. అది ఆ స్వరూపజ్ఞానం యొక్క ప్రభావం. కదలకుండా వుండమని శాసిస్తే మాళ్ళా ఆజ్ఞ ఇచ్చేవరకూ కదలకుండా వుంటాయి ఏవైనా. ఇవి అవి కాదు, ఏవైనా. నీ శరీరేంద్రియ ప్రాణ మనో బుద్ధులలో ఏవైనా సరే, కదలకుండా వుండమని చెబితే అలా కదలకుండా వుంటాయి. అది ఆ స్వరూపజ్ఞానం యొక్క ప్రభావం. అందుకే ఆత్మానుభవానికి అంత ప్రాధాన్యత వచ్చింది.
అయితే ఆత్మ అంగుష్ట ప్రమాణమా? ప్రకాశ స్వరూపమా? సర్వవ్యాపకమా లేక అనేకానేక లక్షణాలు, నిత్యం, శుద్ధం, బుద్ధం, సచ్చిదానందం అనేక రకాలైనటువంటి లక్షణాలతో ఏకరువు పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అయితే, దేహంతో నేననే తాదాత్మ్యతాభిమానం కూడి వున్నప్పుడు దేహాత్మ స్వరూపుడివి అయివున్నావు. నీ జ్ఞాత అంటే అంతఃకరణ సాక్షి అయినటువంటి జ్ఞాతతో కూడియున్నట్లయితే, అంతరాత్మ అంటున్నావు. అదే పరముతో కూడి వుంటే పరమాత్మ అంటున్నావు. ఒకే ఆత్మ శబ్దాన్ని స్థితి భేదంగా, అనుభవజ్ఞాన సూచ్యంగా వాడబడుతుంది వేదాంతంలో. కాబట్టి దేహాత్మ, అంతరాత్మ, పరమాత్మ అనేటటువంటి మూడూ లేవు, ఒకే నేను. దేనితో తాదాత్మ్యతాభిమానం కూడివుంటే అది నువ్వు అవుతున్నావు.
తాదాత్మ్యతాభిమానం అంగంతో కూడివున్నప్పుడు, జీవాంతఃకరణమై, జీవుడనే అభిమానం ఏర్పడి, దేహాత్మ స్వరూపులుగా మిగిలిపోతాం. అయితే ఈ సాంఖ్య విచారణ ద్వారా మనం చేసేటటువంటి ఈ మొత్తానికి కలిపి పృథక్కరణ అని ఒక పేరు. దీనినేమని అంటారండీ? పృథక్కరణ అంటే – అర్థం కాకుండా, తేల్చడానికి వీలుకాకుండా, గజిబిజి గందరగోళంగా, ఎన్ని సంవత్సరాలు చదివినా మిగిలిపోతూ వుండేట్లుగా, జీవితకాలం ప్రయత్నంచినా అంతు, దరి కనబడకుండా ఉన్నటువంటి దానిని పృథక్కరించి, దానిని అధిగమించడానికి కావలసినటువంటి సూత్రాన్ని బోధింప చేసేట్టుగా, దానిని విడివిడి భాగములుగా విభజించి, అన్వయ వ్యతిరేకములతో వాటిని అడ్డుతొలగింపజేసేటటువంటి ప్రయత్నము. నిజానికి అభిమానమే వున్న అడ్డం, వేరే ఇంకేమీ లేదు. ఈ అభిమానాన్ని పృథక్కరించడానికే సాంఖ్య విచారణ. కాబట్టి, ఎక్కడెక్కడైతే అభిమానం – దానిని మళ్ళా రెండు రకాలుగా అర్థం కావడం కోసం నేను, నాది అని రెండు తెలుగు మాటల్లో అందించే ప్రయత్నం చేశారు. పెద్దలందరూ కూడా. మహానుభావులు. అయితే చెప్పడానికి అవి రెండుగా నేను, నాది అంటున్నాం కానీ, జీవాంతఃకరణములో వున్నటువంటి ఒకే భావానికి రెండు పార్శ్వములు అవి. నిన్న మీ అందరితో మీ నేనుఎలా వుందో, మీ నాది ఎలా వుందో మీకు తెలియజెప్పే ప్రయత్నం చేశాం మొట్టమొదటిలోనే. మనందరిలో కూడా నేను, నాది వున్నాయా? లేదా? ఉన్నాయి. అర్థమైందా అండీ? అయితే అభిమానంతో కూడుకుని వుంటే? ప్రమాదాన్ని కొని తెచ్చినట్టే. అభిమానంతో పనిలేకుండా, సామాన్యస్థాయిలో కేవలం ఇంద్రియ వ్యవహారంలో, గుణ వ్యవహారంలో గుణములే గుణములతో ప్రవర్తిస్తున్నాయి. ఇంద్రియములే ఇంద్రియ విషయాలతో ప్రవర్తిస్తున్నాయి. నేను ప్రవర్తించడం లేదుఅనేటువంటి లక్ష్యంలో నిలబడి చూసినట్లయితే, అభిమానాన్ని నిరసించినట్లయితే,  అప్పుడీ సాంఖ్య విచారణ మీకు ఉపయోగపడినట్లే. అందుకనే అవస్థాత్రయాన్ని చెప్పేటప్పుడు, విశ్వుడు, తైజసుడు, ప్రాఙ్ఞుడు, ప్రత్యగాత్మ అని మనం సాక్షిగా చెప్పినప్పటికీ, అక్కడ శాస్త్ర వాక్యంలో జాగ్రదావస్థ యొక్క అభిమాని అంటున్నాడా? లేదా? ఆ అభిమాని విశ్వుడు. తైజసావస్థకు అభిమాని. ఎందుకని అభిమాని అని అంటున్నారు? నిజానికి మాట్లాడితే, అంటే జాగ్రదావస్థ యొక్క అనుభవం లేకపోతే విశ్వుడనే సాక్షి నిర్ణయం వుందా? లేదు. కాబట్టి సాపేక్ష సాక్షి అన్నమాట. ఈ సాపేక్షసాక్షి, మొట్టమొదట ఒక వ్యవహారానికి సాక్షిని పట్టుకునే ప్రయత్నం చేస్తే, సాక్షిత్వ నిర్ణయాన్ని అందుకునే ప్రయత్నం చేస్తే ఆ సాక్షిత్వాన్ని, నిరపేక్ష పద్ధతిగా నిలుపుకోవడానికి కావలసినటువంటి తారక అమనస్కాలు ఉపయోగపడతాయి.
తారక, అమనస్కాలు ఎప్పుడూ కూడా నిరపేక్ష పద్ధతి. సాంఖ్య విచారణ సాపేక్ష పద్ధతి. అంటే పిండాండ పంచీకరణలో వ్యవహరిస్తున్నటువంటి జ్ఞాతయొక్క ప్రభావాన్ని నిర్ణయించి చెప్పడం. జ్ఞాత లేకపోతే పిండాండ పంచీకరణలో వున్న మిగిలిన 24 ఏమీ స్వతహాగా తమంత తాము ఏమీ పనిచేయలేవు. బ్రహ్మాండ పంచీకరణలో అధిష్టానంగా వున్నటువంటి కూటస్థ చైతన్యం గనుక ఆ మిగిలిన 24లో పనిచేయకపోయినట్లయితే, అది యేమీ పనిచేయజాలదు. ఈ రకంగా ఎక్కడికక్కడ ఇలా బోధించడం ద్వారా అధిష్టాన ఆశ్రయ పద్ధతి అంటారు దీనిని. దీనిని ఏమంటారండీ? అధిష్టాన ఆశ్రయ పద్ధతి. అధిష్టాన నిర్ణయం, ఆశ్రయ నిర్ణయం ఈ రెండూ తెలుస్తాయి అక్కడ. ఇలా తెలుసుకున్న తరువాత ఏమి చేయ్యాలట ఇప్పుడు? తెలుసుకుని వదిలెయ్యటమేనా? నీ వ్యవహారాన్ని ఈ దృష్టికోణంతో చూడటం రావాలి. ఈ పంచీకరణ దృష్ట్యా నీ వ్యవహారాన్ని చూడడం రావాలి. నీ అవస్థాత్రయంలో నీవు చేస్తున్నటువంటి సర్వ వ్యవహారాన్ని, అన్ని కదలికలని, అన్ని స్పందనలని, అన్ని వృత్తులని, నీ అభిమానాన్ని, నీ ఉనికిని, నీ వ్యక్తీ కరణని, సమస్తాన్ని ఈ పంచీకరణ దృష్ట్యా చూచినట్లయితే, నీవు అధిష్ఠాన స్థానంలో నిలబడి, మిగిలిన ఇరువదినాల్గింటిలో వ్యవహరించకుండా వెనక్కి తీసుకోవడం అనేటటువంటిది చాలా ముఖ్యం. విరమించడం – ఈ వెనక్కు తీసుకోవడానికి ఏం పేరండీ? విరమించడం. 20.05
మనకు రమించడంలో వున్నటువంటి ఆసక్తి, విరమించడంలో వుండదు. రమించడం అంటే? మనము కాని దానితో చేరిపోవడం, అర్థమైందా అండీ? మనం కానీ దానితో చేరిపోవడం, ఎవరైనా ఉదాహరణ చెప్పగలరా అలా దేనితో చేరి పోతున్నామో?
సూర్యోదయం చూశారా? మీకెప్పుడైనా కానీ, ఆ సూర్యుడు నేనే అని అనిపించిందా? పుట్టింది మొదలు ఇప్పటి వరకూ సూర్యోదయం చాలాసార్లు చూసుంటారు కదా! అవునా కాదా? ఆ సూర్యుడు నేనేఅని ఎప్పుడన్నా అనిపించిందా?
(అనిపించలేదు)
ఏ ఎందుకని?
            అది నేను కాదుముందే నిర్ణయం చేసి పెట్టుకున్నావు కాబట్టి. అర్థమైందా అండీ? అసలు ఆ ఆలోచనే మనకు రాలేదు. మరి అనంత బ్రహ్మాండం, అనంత విశ్వము వ్యాపించి వున్నటువంటి పరమాత్మ నేనని నీకు ఎట్లా తోస్తుంది? 
            ఇప్పుడు నువ్వు ఏం ప్రయత్నం మొదలు పెట్టావు? కళ్ళెదురుగుండా కనపడుతున్న సూర్యుడు నేను కాదనే జీవితం నుంచి, నువ్వు ఎక్కడికి చేరాలి నీ లక్ష్యం?
అనంత విశ్వం ఏ ఆధారస్థితితో నడుప బడుతోందో ఆ పరమాత్మ నేననే నిర్ణయానికి ప్రయత్నాన్ని మొదలు పెట్టావు. చూడండి, ఇక్కడికి అక్కడికి ఎంత సామ్మము వుందో. అర్థమైందా అండీ?
జ్ఞానం ఎంత నిష్కర్షగా మాట్లాడుతుందయ్యా? అంటే, చాలా పద్ధతులున్నాయి వీటిని విశదీకరించడానికి, వాటిలో కొద్దిగా బుజ్జగించి చెప్పేవి, పర్వాలేదులే – అలా అయినా పర్వాలేదు, ఇలా అయినా పర్వాలేదులే, తెలుసుకుని వుంటే చాలులే, కొద్దిగా తెలుసుకుంటే చాలులే, ఈ మాత్రం కూడా తెలుసుకున్నవారు ఎవరు లే? ఇలాంటి పనికి మాలిన వాక్యాలు, ఆప్త వాక్యాలని నేను అననండీ! ఈ సర్దుబాటు ధోరణి, జ్ఞానం విచారణ చేసే సాధకుడికి పనికిరానే పనికిరాదు. ఇది నిషేధం. బాగాగుర్తుపెట్టుకోండి.
మీలో ఎవరైనా సరే వచ్చే గురుపౌర్ణమికి జ్ఞాన సాధకులుగా నిలబడి ఇక్కడ మాట్లాడబోతారు మళ్ళా. ఆ మాట్లాడ బోయే వారందరూ కూడా, నిన్నటినుంచి మాట్లాడిన వాళ్ళను గమనిస్తున్నాము. మీ మాటలలో మీ సాధనాబలం, మీ అనుభవజ్ఞానం తొంగి చూడాలి. మీ జీవితానుభవం అందులో కనబడాలి. దాన్ని చూచి వినే వాళ్ళు ఆదర్శంగా స్వీకరించాలి. ఇది సాధ్యమే అనేటటువంటి నిర్ణయాన్ని పొందుతారు. కేవలం పుస్తకాలలో వున్నటువంటి, కొన్ని 10 వాక్యాలను ఏరి కోరి మనం ప్రకటించినంత మాత్రాన వినేవారి అందరిలో కెల్ల ఆ విశ్వాసం, పరమాత్మనేనుఅనే నిర్ణయాన్ని పొందవలసినంతగా బలపడదు.
నీకు గురువెందుకయ్యా? అంటే సజీవ సాక్ష్యం. నీలాంటి జీవ శరీరాన్నే ధరించి వున్నటువంటి ఒక వ్యక్తి, నీ లాగనే కనపడుతున్న ఒక వ్యక్తి, జీవ వ్యవహారాన్ని నీ కళ్ళ ముందే చేస్తున్న వ్యక్తి, నీ లాగానే తింటున్నాడు, నీ లాగానే వుంటున్నాడు, నీ లాగానే పడుకుంటున్నాడు, నీ లాగానే అన్నీ చేస్తున్నట్టు కనబడుతున్న ఒక వ్యక్తి, ఏ నిర్ణయాన్ని పొందగలిగి వున్నాడయ్యా? అంటే, పరమాత్మనేనుఅన్నటువంటి స్థితిలో నిలబడి వుండి, నీకు మార్గదర్శకత్వం చేయడానికి ఉపయోగపడుతున్నాడు. తనకేమీ ప్రయోజనం లేదు, ఆయనకేమీ అవసరం లేదు, అవకాశము లేదు.
ఎందుకని? సర్వవ్యాపకమైనటువంటి స్థితినుంచి, అత్యంత పరిమిత స్థాయికి దిగిరావాల్సిన అగత్యం లేదు. కానీ, సహజముగా అందరియెడల కరుణ రసాద్ర హృదయులైనటువంటి, ఆ గురుకృప వాళ్ళను అవేశించి వుంటుంది కాబట్టి, వారు వారి మాటల ద్వారా, చేష్టల ద్వారా, సంజ్ఞల ద్వారా, మౌనం ద్వారా మీలో ఈ చైతన్యాన్ని మేలుకొలిపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మిమ్మల్నందరినీ మేం గమనిస్తున్నాం. మీరు ఏ స్థాయిలో దీనిని అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు? ఈ చైతన్యాన్ని మేల్కొలపడం చాలా స్థాయిలలో మేల్కొలపవచ్చు. విషయస్థాయిలో కూడా మేల్కొలపవచ్చు. విషయ వ్యవహారంలో వివేకంతో వ్యవహరించడం, అది కూడా ఒక మేల్కొలుపే. కానీ అక్కడికే నువ్వు చైతన్య దీప్తిని గనుక పొందినట్లయితే, అక్కడికే నువ్వు ఈ చైతన్య స్ఫూర్తిని పొందినట్లయితే, దీనిని కొనసాగింప చేసుకోవడానికి, నీ దగ్గర వున్నటువంటి సాధనా బలం, సాధనా సంపత్తి, సరిపోయే అవకాశం తక్కువ. కాబట్టి,
గురుపౌర్ణమి యొక్క ఉద్దేశ్యం ఏమిటయ్యా? అంటే, ఇవాళ ఈ గురుపౌర్ణమి సందర్భంగా పొందిన సామర్థ్యాన్ని, నీ నిజజీవితంలో జీవించి, అనుభవ జ్ఞానంగా మరల్చుకుని, మార్చుకుని, మరలా వచ్చే గురుపౌర్ణమికి ఇంతకంటే ఉన్నత తరమైనటువంటి చైతన్య స్ఫూర్తిని పొందడానికి సిద్ధపడి, ఆ తహతో ఆ తపనతో ఆ తీవ్రమైనటు వంటి స్థితిలో నువ్వు రావాలి. గురువు దగ్గరకు నువ్వు ఏ రోజైనా వెళ్ళు, ఆ రోజే పౌర్ణమి, ప్రత్యేకంగా పౌర్ణమి వెతుక్కుని రావక్కర్లేదు. కానీ నువ్వు వచ్చేటప్పుడు ఏముండాలి నీ దగ్గర? నువ్వేం పొందదలచుకున్నావో ఆ స్పష్టత వుండాలి నీ దగ్గర. నీ యొక్క అనుభవాన్ని, నువ్వు పొందదలచుకున్న దాని యొక్క తపనని, నీ అంతరంగాన్ని ఆవేశించి వున్నట్లయితే, ఆ స్థితిని గమనించి బోధిస్తారు. ఆ స్థితిలోనుంచి నువ్వు బయట పడటానికి కావలసిన శక్తిని, తన యొక్క దర్శన, స్పర్శన, సంభాషణల ద్వారా నీకు అందిస్తారు.
నిజానికి సూటిగా చెప్పాలి అంటే, ఈ విధానం సరియైంది కాదు. కాకపోతే అంతకు అవతల వున్నదానిని సరాసరి పట్టుకునేటంత సామర్థ్యం అందరి వద్ద వుండదు కాబట్టి ఈ ఒక అభినివేశం, ఈ ఒక నాటకాన్ని, ఈ ఒక role play ని గురువు ప్రదర్శిస్తాడన్నమాట. తాత్కాలికంగా నీ అభివృద్ధి కొరకు, నీ ఉద్ధరణ కొరకు. ఎలా అంటే? స్వాత్మానుగ్రహం ఎంత అవసరమో, సద్గురు కృపకూడా అంతే అవసరం. మరి ఇలా చెప్తున్నారు కదండీ, నాలో వున్నటువంటి ఆత్మ యొక్క అనుగ్రహము, సద్గురు కృప కావాలి మరి, ఈశ్వర కృప అక్కర్లేదా, పరమాత్మ కృప అక్కర్లేదా? అదీ కావాలి. ఇప్పుడు నేను దేనికోసం ప్రయత్నించాలి ఈ మూడింటిలో అన్న మీమాంస అవసరం లేదు. అర్థమైందా అండీ? ఎందుకంటే స్వాత్మ అనుగ్రహం అనేది, తీవ్ర మోక్షేచ్ఛ చేత తీవ్ర వైరాగ్యము చేత సాధించ బడుతుంది. ఈ రెండు లక్షణాలు లేకపోతే ఎన్ని వున్నా స్వాత్వ అనుగ్రహం లభించదు. అది లభించక పోతే, నువ్వు ఎన్ని కష్టాలు పడ్డా, నేను సాధనలు అననండీ అప్పుడు, ఈ స్వాత్మ అనుగ్రహం వుంటేనే అది సాధన అవుతుంది. ఈ స్వాత్మ అనుగ్రహం అంటే తీవ్ర వైరాగ్యం, తీవ్ర మోక్షేచ్ఛ లేని వాడు పడే వన్నీ కష్టాల క్రిందే లెక్క. అవి సాధనలు కావు. అందుకే ఇందాక నేను మొదట్లో లేని కష్టాలు అని చెప్పాను.
ఎవరికైతే ఈ జన్మలోనే మోక్షాన్ని సాధించాలి, ఈ అరుదైనటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. మరలా ఈ చక్ర భ్రమణాన్ని కొనసాగించకూడదు.ఈ చావుపుట్టుకలు అనేదే మొట్టమొదటి సమస్య నేను పరిష్కరించవలసినది. అని నిద్ర పోయేటప్పుడు, మరణం వచ్చే టప్పుడు, నిదుర వచ్చేదాక, చచ్చేదాక’ – ఒక అంశాన్ని గుర్తు పెట్టుకోవలట. ఏమిటట అది? లేనిది ఎఱుక – ఉన్నది బయలుఅని పెద్దల వాక్కు. బయలన్నది ఎందుకు చెబుతున్నారంటే అది స్థిరానికి సూచిక. దాంట్లా మార్పు లేని స్థితి అని అర్థం. మిగిలినది అంతా మారేది అని అర్థం.             ఆ ఎఱుకని మళ్ళా నీకు అర్థం కావడం కోసం అంగం అనీ, లింగం అనీ, దాంట్లో ఎవో రకరకాలవన్నీ జీవులని, ఈశ్వరులుని, జగత్తని రకరకాలుగా చెప్పవచ్చు. అయితే నీవు స్వానుభవ జ్ఞానంతో, ఎదుగుతూ, తారకసూత్రం యొక్క అనుభవజ్ఞానాన్ని కనుక నీవు పొందినట్లయితే, ప్రత్యక్‌ పరమాత్మలు అభిన్నులు అనేటటువంటి బ్రహ్మజ్ఞాన నిర్ణయం, ఇందాకటి నుంచి ఇవాళ ఉదయం మాట్లాడిన వారు ఎవరో మహావాక్యాల ప్రస్తావన తెచ్చారు. ఆ నాలుగు మహావాక్యాల యొక్క అనుభవజ్ఞానం నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళి విడిచిపెడుతుందంటే, ప్రత్యక్‌ పరమాత్మలు అభిన్నులు, వేరు కాదు అనేటటువంటి అనుభవజ్ఞాన స్థితిలో విడిచి పెడుతుంది. నేనెందుకు మాటి మాటికి అనుభవజ్ఞానం అని నొక్కుతున్నాను అంటే, చదవటమో, వినటమో, తెలుసుకోవటమో సరిపోదు. అది లవలేశం ఆవగింజంత. ఎందుకంటే, మీకు తెలియడం కోసమని చిన్న పోలిక చెప్తాను, ఎందుకంటే పోలిక చెప్పకపోతే, ఎందుకంటే పోలిక చెప్పకపోతే తెలుసుకోలేని దశలో వున్నారు కాబట్టి.
సాంఖ్య విచారణలో చేసినటు వంటి సమస్త ప్రయత్నమూ కూడా, తారకములో లవలేశం. అర్థమైందా అండీ! అంటే తారకమే ప్రధానం, కానీ సాంఖ్య విచారణ లేక తారకము ఎప్పటికీ నిలబడదు. ఆ తారకం యొక్క అనుభవజ్ఞానం ఏదైతే వుందో, అది అమనస్క స్థితిలో లవలేశం. ఇంత భేదం వుంది ఈ మూడింటి మధ్యే. ఎందుకని అలా చెబుతున్నారయ్యా అంటే, అమనస్కం అనేది స్థిరం. శాశ్వతం. పరిణామ రహితం. ఎన్నైతే వేదాంతంలో చెప్పించ బడుతున్నాయో, అవన్నీ కూడా రహితం. అది అమనస్కం అంటే. కాబట్టి మీ నిత్య జీవిత జీవనానుసంధానంలో, ప్రతీ క్షణము, ప్రతి రెప్పపాటు అత్యంత విలువైనది. లక్ష్యంకోసమే పరిశ్రమించడం కోసం వచ్చిన జీవితం. సాధనయే పరమావధి. అనేటటువంటి కఠినమైనటువంటి నిర్ణయాన్ని స్వీకరించాలి. వజ్రకఠోరమైనటు వంటి మనసు వుండాలి, సింహ హృదయం వుండాలి. తాత్కాలికంగా వచ్చిపోయేటటువంటి, మా ఆయన కోప్పడ్డాడు, మా ఆవిడ సరిగ్గా వినలేదు, మా పిల్లలు అనువుగా లేరు, ఏవో రకరకాలు, నిన్నటి నుంచి ఎంతో మంది యొక్క జీవితాలు, వాళ్ళు నోరు తెరిస్తే చెప్పేవన్నీ ఏమిటయ్యా అంటే ఇలాంటివే. నేను అక్కడకు వెళ్ళానండీ, అక్కడ అలా జరిగిందండి, ఇక్కడ ఇలా జరిగిందండి, అలా జరిగినదాంట్లో నేను అలా అనుకున్నానండీ, ఇది కరెక్టేనా అండీ? ఇది ఏ స్థాయిలోదండీ, ఇది. ఇప్పుడు నిర్ణయం ఏ స్థాయిలో వుంది? నువ్వు పొంద వలసిన లక్ష్యం ఏ స్థాయిలో వుంది? కాబట్టి,
మీరు ఇలా అడిగినంత కాలం, బాగాగుర్తుపెట్టుకోండి, అంటే నేను 15 ఏళ్ళ నుంచి చూస్తున్నా. ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు, ఒక సంవత్సరం కాదు, 15 సంవత్సరాల నుంచి చూస్తున్నా. ఈ 15 సంవత్సరాలలో కేవల జ్ఞాన పద్ధతిగా, ఇందాక మాట్లాడినప్పుడు ఈ కేవలజ్ఞానం అనే పదాన్ని వాడారండీ. కేవలజ్ఞాన నిర్ణయం పొందటం కోసం మాత్రమే వచ్చేవాళ్ళకి, ఉపయోగపడేది సద్గురు కృప. మిగిలినది అంతా స్వాత్మ అనుగ్రహమే. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు మూడుగుణాలను అధిగమించాలన్నా లేకపోతే ఇంకేదో రకరకాలు అంటే జ్ఞాత యొక్క స్థాయిని విచారించి అధిగమించిడానికి కావలసిన సమస్తమూ కూడా స్వాత్మ అనుగ్రహమే. అక్కడ గురువు చేసే సహాయం నిజానికి మాట్లాడితే సరాసరి సహాయం చేసేదేం లేదక్కడ. కేవలం మీకొక దీపాన్ని పెట్టి చూపెట్టడం అంతే. కొద్దిగా తెలుసుకోలేక పోతున్నామని, తెలుసుకోవడానికి కావలసినటువంటి ప్రోద్బలాన్ని అందించటం. నీలో ఆ ఉత్సాహాన్ని రేకెత్తించడం, సాధన దిశగా అడుగులు వేయించే, మొదటి అడుగులు వేయించే ప్రయత్నం.
యథార్థంగా సద్గురు కృపని అందుకోవాలి అంటే, జ్ఞాత కూటస్థుడు రెండూ ఒకటే ఎలాగా అనేటటువంటి, తీవ్రమైనటు వంటి స్థితిలో వచ్చిన వాళ్ళు ఎవరో, వాళ్ళ దగ్గర నుంచి మొదలవుతుంది సద్గురు కృప. ఇక మూడవదేం కావాలి? పరమాత్మ కృప.

ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే,
వ్యోమవత్‌ వ్యాప్త దేహాయ దక్షిణాం మూర్తయే నమః
దక్షిణామూర్తి విధానమని అన్ని బోధనలలో కూడా ఉత్కృష్టమైనటు వంటి బోధనా పద్ధతిని, సూచించడానికి ఈ పదాన్ని సూచిస్తారు. కాబట్టి, పరమాత్మ నిర్ణయాన్ని స్థిరంగా నిలపడానికి, ఆ పరమాత్మ నిర్ణయ స్థితిలో వున్నటు వంటి లోటు పాట్లు, అనంత విశ్వ వ్యవహార నిర్ణయంలో వున్నటువంటి లోటుపాట్లు, అనంత విశ్వ వ్యవహారం ఎలా లేదో నిరూపించేటటువంటి కేవలజ్ఞానం. ఇది కేవల జ్ఞానం. అట్టి కేవల జ్ఞానాన్ని అందుకోవడానికి ఉపయోగపడేదేదైతే వున్నదో, దానిపేరే దక్షిణామూర్తి విధానం. దాని పేరే మౌనవ్యాఖ్య.

మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్వ్తం యువానం
వర్షిష్ఠాం తేవ సదృషిగణైః ఆవృతం బ్రహ్మ నిష్ఠైః
ఆచార్యేంద్రం చిన్మద్ర కలితం ఆనంద రూపం
స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తి మీడే II
ఆశ్రయించిన వాళ్ళు ఎవరయ్యా? బ్రహ్మనిష్ఠులు. బోధించే ఆయన ఎవరయ్యా? పరబ్రహ్మము. ఏం బోధిస్తాడు? మౌనవ్యాఖ్య. వ్యాఖ్య అంటే అర్థం ఏమిటంటే విశేషేణ ఆఖ్యాన ఇతి వ్యాఖ్యా. అంటే మనం మాట్లాడేదాని వెనుక ఒక లక్ష్యార్థం వుంది. ఈ శబ్దార్థం వెనుకాల ఒక సూచన వుంది. ఆ సూచన గురించి చెప్పేటటువంటి విధానం. అంతేకానీ, ఆయనేదో తత్త్వమసిని చూపెట్టేటటువంటి చిన్ముద్రను చూపెట్టాడండీ. నాకంతా అర్థమైపోయిందండీ, అనేటటువంటి బాహ్య అర్థాన్ని స్వీకరించమని కాదు.
          నిజానికి గురుహృదయములో కనుక నీవు స్థానాన్ని సంపాదించింనట్లయితే, గురువు ఏ స్థితిలో అయితే ఈ పరమాత్మ స్థితిని, పరబ్రహ్మ స్థితిని అనుభవిస్తున్నాడో, ఆ స్థితిని నీవుకూడా అనుభవించవచ్చు. అంటే గురుశిష్యులు ఏకం అయ్యే పద్ధతిలో మాత్రమే ఈ మౌనవ్యాఖ్య సాధ్యం అవుతుంది. అంటే అవాంగ్మానస గోచరమని నువ్వు చెబుతున్నటువంటి ఈ పరమాత్మ స్థితిని, ఇంద్రియములతో బోధించడానికి వీలు కాదన్నమాట. కాబట్టి, నువ్వు ఆ అనుభవజ్ఞానాన్ని పొందాలి కదా, ఆ నిర్ణయాన్ని పొందాలి కదా, ఆ వస్తునిశ్చయజ్ఞానాన్ని పొందాలి కదా! ఎఱుక లేదని నిరూపించబడాలి కదా, ఆ పొందడం కోసమని, గురుశిష్యుల యొక్క ఐక్యతా సిద్ధి ఒక్కటే సాధ్యమైయున్నది. అటువంటి ఐక్యతా సిద్ధిని నువ్వు ఎప్పుడైతే పొందుతావో, అప్పుడా కేవల జ్ఞానాన్ని సాధించడానికి, కేవలజ్ఞానానుభవాన్ని పొందడానికి అర్హతను సంపాదిస్తావు. ఆ మౌన వ్యాఖ్య అర్థమయ్యటటువంటి స్థితి వస్తుంది. కాబట్టి, గురువుగారు కనబడగానే అందరూ చేసేటటువంటి పని ఏమిటంటే పాదాలమీద పడిపోవడం. గురుపాదములు నన్ను ఎవరో అడిగారు. ఇందాక కూడా ఉదయం ఎవరో స్వామివారిని అడుగుతున్నారు. ఏంటండి అంటే తతః కిం తతః కిం గురోః అంఘ్రి పద్మే... తతః తతః కిం.. అనాత్మ శ్రీ విగర్హణం అని, ఆది శంకరులు చేసినటువంటి ఈ గురుపాదములను ఆశ్రయించడం అంటే అర్థం, కళ్ళెదురుగుండా కనబడుతున్నటువంటి ఒక పటమో, ఒక విగ్రహమో లేక సశరీరులైన వారి పాదముల మీద పడిపోవడం కాదు. నీవు ఎలా జీవిస్తే గురువుగారి హృదయంలో స్థానాన్ని సంపాదించగలుగుతావో, అలా జీవించడమే వాళ్ళు గమనించేది. నీ జీవనాన్ని గమనిస్తారు, నీలో వున్నటువంటి తీవ్ర మోక్షేచ్ఛను గమనిస్తారు. నీలో వున్నటు వంటి కేవలజ్ఞానాన్ని పొందడానికి కావలసిన తహను గమనిస్తారు. నీవు సాధిస్తున్నటువంటి మార్పును గమనిస్తారు. దివ్యజ్ఞాన పరిధిలో దైవీ ప్రణాళికలో భాగం అవ్వడానికి నీవు చేస్తున్నటువంటి త్యాగ శీలతను గమనిస్తారు. ఇవి చాలా ముఖ్యం త్యాగం లేనిదే అమృతత్వం సిద్ధించదు. కాబట్టి మీరందరూ కూడా, వీటన్నంటికీ కలిపి ఒకే పేరుందండీ, సల్లక్షణములు, వీటన్నిటినీ కలిపి ఏమంటారండీ? సల్లక్షణములు. ఆ సల్లక్షణములని మీ నిజజీవితంలో కలిగియుండాలి. గురువుని ఆశ్రయిస్తున్నావంటే, నీలో ఎటువంటి స్థితి వుండాలి అని అంటే, నది కడలిలో ప్రవేశించేటప్పుడు ఎలా ప్రవేశిస్తుందో, అటువంటి హృదయస్థితి వుండాలి. అటువంటి తాదాత్మ్యతానుభూతిని నువ్వు పొందాలి. నీవు లేవు. గురువు మాత్రమే వున్నారు. నీవు లేవు ఈశ్వరుడు మాత్రమే వున్నాడు. నీవు లేవు పరమాత్మ మాత్రమే వున్నాడు అనటటువంటి తాదాత్మ్యతానుభూతిని నీవు ఎప్పుడైతే పొందుతావో అప్పుడు, నీవు కేవలజ్ఞానాన్ని పొందడానికి సంసిద్ధతను పొందుతావు. ఇది నిరపేక్ష పద్ధతి. సాపేక్ష పద్ధతి ముందే చెప్పాం మళ్ళా దాని గురించి చెప్పం. నిర్ణయంగా (నిన్నకూడా చెప్పా)
నిర్ణయం రెండు పద్ధతులు, వస్తునిశ్చయజ్ఞానము, విపర్యయ జ్ఞానము. సాపేక్ష పద్ధతి అంతా విపర్యయ జ్ఞానము. అక్కడ అంతా, అనేక తీరులలో వస్తునిశ్చయ జ్ఞానం అనేటటువంటి కేవల జ్ఞాన పద్ధతిలో, లింగాంగ భంగం ఎట్లా అవుతుందో మాత్రమే అనుభూతి కలిగేటట్లు చేస్తారు. లింగ విచారణ, అంగ విచారణ, విచారణాశీలతకు సంబంధించిన అంశాలు అక్కడేమే వుండవు. కేవలం సూచ్యార్థకములైనటువంటి, లక్ష్యమును సూచించేటటువంటి ఒకటి, రెండు మాటలు మాత్రమే ఉచ్ఛరిస్తారు. ఒకతో వారి మాటలు కూడా అవసరంలేదు, వారియొక్క కనుసైగలే సరిపోతాయి. వారి యొక్క మౌనమే సరిపోతుంది. వారి మౌనాన్ని అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి అర్హతను నువ్వు సంపాదిస్తావు. కాబట్టి మీరందరూ కూడా గురువును ఆశ్రయించడం అంటే దాంట్లో వున్నటువంటి ఔన్నత్యాన్ని, దాని వల్ల ఒనగూరేటటువంటి పరమప్రయోజనాన్ని, పరమును తెలుసుకునేటటువంటి ప్రయోజనం, పరములో నీవు స్థిరపడేటటువంటి ప్రయోజనం, ఆ విధిగా ఆ లక్ష్యం దిశగా మీరందరూ జీవితంలో సాధించాలని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు.
...

Download Pdf (will update soon)

.... ఓం ....